Ambati Rambabu: ప్రధాని మోదీ వచ్చి మాట్లాడినా వీళ్లకు హైప్ రాలేదు: మంత్రి అంబటి

  • మూడు పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్న మంత్రి అంబటి 
  • 2014లోనూ ఇదే కూటమి పోటీ చేసిందని వెల్లడి
  • ఒకసారి గెలిచి రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశారని విమర్శలు
  • ప్రజాగళం సభకు మోదీ వచ్చినా అనుకున్నంత హైప్ రాలేదన్న అంబటి
Ambati Rambabu slams three parties alliance

ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్వహించిన ప్రజాగళం సభపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. 

ప్రజాగళం సభతో ఏం సందేశం ఇచ్చారు? 2014లోనూ ఇదే కూటమి పోటీ చేసింది కదా...  నాడు ప్రజలు పొరపాటున ఓటు వేస్తే గెలిచారు... అధికారంలోకి వచ్చి ఆగం చేశారు... రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేశారు అని అంబటి మండిపడ్డారు. 

ఆ తర్వాత విడిపోయారని, ఒకరినొకరు తిట్టుకున్నారని, ప్రధాని మోదీని చంద్రబాబు ఏమని తిట్టారో ప్రజలకు ఇంకా గుర్తుందని అన్నారు. నాడు కూటమి కుమ్ములాటలు చూసిన ప్రజలు మళ్లీ వీళ్లకు ఓటేసే పరిస్థితి లేదని అంబటి అభిప్రాయపడ్డారు. ఇటీవల మూడు పార్టీలు కలిసి నిర్వహించిన సభ ఘోరంగా విఫలమైందని అన్నారు. 

ముగ్గురూ కలిసి వచ్చినా జగన్ ను ఓడించడం అసాధ్యం, మీకు ఆ బలం లేదు అనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన సభ ప్రజాగళం సభ అని వివరించారు. ఆ సభకు ప్రధానమంత్రి వచ్చి మాట్లాడిన తర్వాత కూడా మీకు హైప్ రాలేదు అని పేర్కొన్నారు. ప్రజల హృదయాల్లో ఉన్న జగన్ ను ఏం చేయలేరని స్పష్టం చేశారు. 

 ప్రజాగళం పేరు పెట్టుకుని నిర్వహించిన సభలో మైక్ కూడా మూగబోయిందని ఎద్దేవా చేశారు. మైక్ కూడా సరిచేసుకోలేని వారు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తారని వ్యంగ్యం ప్రదర్శించారు. 

చంద్రబాబు ఎప్పుడూ అభ్రదతాభావంలో కొట్టుమిట్టాడుతుంటారని, పవన్ కల్యాణ్ తో సాధ్యం కాదని మోదీతో కలిశారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభతో టీడీపీకి వాస్తవం బోధపడిందని, అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకున్నారని అన్నారు.

More Telugu News